దీపావళి కథతో అందరూ కనెక్ట్‌ అవుతారు

ABN , First Publish Date - 2023-11-08T00:59:46+05:30 IST

‘స్రవంతి మూవీస్‌’ సంస్థపై ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించారు రవికిశోర్‌. నిర్మాతగా 38 ఏళ్ల అనుభవం ఆయనది. ఈ ప్రయాణంలో 38 చిత్రాలు చేశారు. ‘స్రవంతి’ సంస్థ నుంచి ఓ సినిమా వస్తోందంటే...

దీపావళి కథతో అందరూ కనెక్ట్‌ అవుతారు

‘స్రవంతి మూవీస్‌’ సంస్థపై ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించారు రవికిశోర్‌. నిర్మాతగా 38 ఏళ్ల అనుభవం ఆయనది. ఈ ప్రయాణంలో 38 చిత్రాలు చేశారు. ‘స్రవంతి’ సంస్థ నుంచి ఓ సినిమా వస్తోందంటే కచ్చితంగా ప్రేక్షకుల దృష్టి అటువైపు పడుతుంది. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘దీపావళి’ ఈనెల 11న విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి రవికిశోర్‌ ఏమన్నారంటే...

  • ‘‘కథల గురించి అన్వేషిస్తున్న క్రమంలో ఓరోజు చెన్నై వెళ్లాను. అక్కడ ఓ మిత్రుడు ‘దీపావళి’ కథ గురించి చెప్పాడు. వెంటనే కనెక్ట్‌ అయ్యాను. దర్శకుడు ఆర్‌.వెంకట్‌కి ఫోన్‌ చేస్తే ఆ సినిమా మరో నిర్మాతతో చేస్తున్నానన్నారు. కొంతకాలానికి సదరు నిర్మాత ఆర్థిక పరమైన కారణాల వల్ల చేయడం లేదని తెలిసి.. నేను ఈ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేశాను’’.

  • ‘‘తెలుగులో ఈ సినిమాని తనికెళ్ల భరణి లాంటి నటీనటులతో తీయొచ్చు. కానీ.. దర్శకుడు అనుకొన్న ఫ్లేవర్‌ రాదేమో అనిపించింది. అందుకే పూర్తిగా ఓ తమిళ సినిమాలానే ఈ చిత్రాన్ని రూపొందించాం. అక్కడ ప్రీమియర్‌ షో వేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. తెలుగులో ‘బలగం’ లాంటి చిత్రాలు మంచి వసూళ్లు దక్కించుకోవడం కూడా స్ఫూర్తి కలిగించింది. అందుకే తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’.

  • ‘‘దీపావళికి బాణాసంచా, పిండివంటలూ ఎంత ముఖ్యమో, కొత్త బట్టలు కూడా అంతే ముఖ్యం. మా సినిమా పండక్కి కొత్త దుస్తులు వేసుకొన్న అనుభూతి ఇస్తుంది. ఈ కథతో, పాత్రలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. సినిమా చూశాక.. ఓ అనుభూతికి గురవుతారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు’’.

  • ‘‘నిర్మాతగా ఇన్నేళ్ల ప్రయాణంలో చేసినవి 38 సినిమాలే. నేను చేసిన సినిమాలకంటే, వద్దనుకొని పక్కన పెట్టేసిన కథలే ఎక్కువ. కథ చెప్పినప్పటి నుంచి సినిమాగా రూపుదిద్దుకొనేంత వరకూ ప్రతీ దశలోనూ, ప్రతీ విషయంలోనూ నేను ఉంటా. సినిమాపై ప్రేమ, అభిరుచి ఎక్కువ. భయం కూడా ఎక్కువే. అందుకే తక్కువ సినిమాలు చేశానేమో. అయితే చేసిన సినిమాల్లో ఒకట్రెండు మినహాయించి అన్నీ సంతృప్తి ఇచ్చాయి. ‘ఈ సినిమా ఎందుకు చేశాను’ అనే ఫీలింగ్‌ ఎప్పుడూ రాలేదు’’.

  • ‘‘రామ్‌ కెరీర్‌ సంతృప్తికరంగా సాగుతోంది. తన ప్రయాణం పట్ల నేను సంతోషంగా ఉన్నా. తను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఓ మంచి కథ దొరికినప్పుడు, రామ్‌ దానికి సూటవుతాడని అనిపించినప్పుడు తప్పకుండా తనతో సినిమా చేస్తా. బడ్జెట్లు పెరిగిపోతున్నాయని ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. కానీ పక్కా ప్రణాళికతో సినిమా చేస్తే అనుకొన్న సమయంలో, అనుకొన్న బడ్జెట్‌లో సినిమా తీయొచ్చు’’.

Updated Date - 2023-11-08T00:59:50+05:30 IST